Saturday, June 28, 2014

అచ్చు పుస్తకాలు బాబయ్యా!

భారతీయులు వివిధ పాశ్చాత్యదేశాల్లో‌ఉన్నత పదవుల్లో నియుక్తులౌతున్న  రోజులివి. ఇలా  నియమింపబడుతున్నవాళ్లంతా   దాదాపు  నలభై  సంవత్సరాల వయస్సువాళ్ళు-  దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మన దేశంలో డిగ్రీ చదువులు చదివిన వాళ్ళు- అంతకు కొద్ది సంవత్సరాల ముందు పదోతరగతి పరీక్షలు రాసి ఉంటారు.
వాళ్ళలోఎవరినైనా కదిల్చి చూడండి: 'చిన్నప్పుడు మేం బాగా చదివాం. మమ్మల్ని  ఫలానావాళ్ళు బాగా చదివించారు. మా బళ్ళో ఫలానావాళ్ళు మాకు చక్కని పునాది వేశారు' అనిగుర్తుచేసుకుంటారు.
అంటే  ఇవాల్టి మన హైస్కూలు చదువులు ఎలా ఉన్నై అన్నది నిజంగా నిగ్గు తేలేది కనీసం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అన్నమాట. ఇది  పాఠశాల విద్య గురించి మాట్లాడేందుకు  మొదటి అవరోధం.

ప్రతి నాలుగైదేళ్ళకూ ఓసారి  అచ్చు పుస్తకాలు మారుస్తాం. "ఇవి బాలేదు"అని మొత్తుకునేవాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు.  వాళ్ళకు అనువైన ప్రభుత్వం వచ్చినప్పుడు  ఇంకో రకంగా మార్చేస్తారు. "ఇవీ బాలేదు" అని ఈసారి ఇంకోళ్ళు మొత్తుకుంటారు.
అందువల్ల, పాఠ్య పుస్తకాల నిర్మాణంలోనే   ప్రామాణికత  తేవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఇరవైఐదు సంవత్సరాల తర్వాత సిగ్గుపడాల్సి రావచ్చు.

అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఉండే  కంపెనీల ఓనర్లకు  ఆసియా దేశాలనుండి వచ్చిన పనివాళ్లంటే ఇష్టం.  కారణాలేంటని అడగండి- ఎవరైనా చెబుతారు: ౧. ఆసియా వాళ్ళు  తక్కువ జీతాలకు పనిచేస్తారు. ౨.ఎక్కువ సమయం‌  పాటు కదలకుండా కూర్చొని పనిచేస్తారు ౩.ఎక్కువ గొణగరు. ౪.శ్రమిస్తారు; పనిలో ప్రాణం పెడతారు.
మరి వాళ్ళవాళ్ల దేశాల యువకులు? ఎక్కువ జీతాలడుగుతారు; రోజుకు రెండు గంటలు టేబుల్ ముందు కూర్చోగానే  oh are we tired అంటారు; పని ఎక్కువ ఉందని గొణుగుతూనే ఉంటారు; వారాంతంకోసమే ఎదురు చూస్తుంటారు; అస్సలు శ్రమపడరు-పనిదొంగలుగా ఉండేందుకు ఇష్టపడతారు.
వీటిలో‌  జీతాల మధ్య తారతమ్యం అంతర్జాతీయ అసమానలతలతో సంబంధం ఉన్న అంశం. ఆ సంగతిని ప్రక్కన పెడితే, ఆసియా దేశస్తులకున్నాయంటున్న   మిగిలిన అన్ని  పాజిటివ్ గుణాలూ  వాళ్ళ  బడి స్థాయినుండి నేర్చుకున్నవే అన్నది స్పష్టంగా తెలుస్తున్నది.  వాళ్ళ విద్యా విధానాల్లో ఉన్నవేవో ఈ గుణాలను  ప్రోత్సహించాయి; పాశ్చాత్య  విద్యా  విధానాల్లో ఉన్నవేవో వాళ్ల  చెడ్డ గుణాలకు కారణాలయ్యాయి-
అంటే అర్థం చేసుకుందాం. ఇంతకాలంగా  మనం మనకు తెలిసో, తెలీకో  మన పిల్లలకు   చాలా సేపు కదలకుండా కూర్చొని, ఫోకస్డ్ గా పని చేయటం నేర్పిస్తున్నాం. ప్రతి చిన్నదానికీ గొణగకుండా ఇష్టంగా  నేర్చుకోవటం, అర్థం‌చేసుకోవటం, పని చేయటం నేర్పిస్తున్నాం. శ్రమించే తత్వాన్ని ఇస్తున్నాం; పనిలో ప్రాణం‌పెట్టటంలో శిక్షణనిస్తున్నాం.
ఇప్పటి మన నూతన విద్యా విధానానికి కూడా ఇవన్నీ ప్రాతిపదికలుగా ఉండాలి.

ఈ దృష్టికోణంతో‌ పరిశీలిస్తే, మన అచ్చుపుస్తకాలు- ఇరవైఐదు సంవత్సరాల క్రితం హిమాలయాలంత ఉన్నతంగా ఉన్నవి, జారుతూ జారుతూ వచ్చాయనీ, మరీ అధ:పాతాళానికి కాకపోయినా, కనీసం సముద్రమట్టానికైతే చేరుకున్నాయనీ అనిపించక మానదు.

ఉదాహరణకు, మన తెలుగు అచ్చుపుస్తకాలనే తీసుకోండి. (ముప్పాళ రంగనాయకమ్మగారు గత నలభై-యాభై ఏళ్ళ తెలుగు అచ్చు పుస్తకాలను పోలుస్తూ  రాసిన పుస్తకం ఒకటి చాలా విలువైంది..దొరికితే చదవండి) వాటిని రాసిన  బృందాల్లో ఎవరెవరున్నారో చూడండి: పాపయ్యశాస్త్రి, జాషువా, దాశరధి- ఇట్లాంటి లబ్ధ ప్రతిష్ఠులైన ధురంధరులు మనసు పెట్టి, పిల్లల తెలుగు పుస్తకాలను తయారు చేసి పెట్టారు. ఇవాల్టి రోజున, మనం అంత గొప్ప తెలుగువాళ్ళు  సూచించిన  క్రమాన్ని   అలవోకగా తృణీకరించి  ఏం   బావుకుంటున్నామో  అర్థం కాదు.
ఈనాటి  తెలుగుపుస్తకాల్లో తప్పులు కొల్లలు. పునరుక్తి దోషాలకు లెక్కలేదు. సామాన్యమైన విషయానికి  అలంకార హీనంగా  వివరణ ఇస్తూ పోవటానికి  అంతులేదు. (బొకేలు తయారు చేయటం గురించిన ఒక పాఠం ఐదో తరగతి  తెలుగువాచకంలో ఉంది చదవండి-oh god! మన భాష అవసరం ఏంటి, ఉద్దేశం ఏంటి, దిశ ఏంటి, గమ్యం ఏంటి?) పద్యరచనా, వచనమా, నాటకమా, బుర్రకథా, వ్యాసమా, కథానికా- ఏ ప్రక్రియ అనేది లేదు. వ్యాకరణ దోషాలను వాడుక భాష  ముసుగున మరగు పరచటం.. చెప్పద్దు.

ఇక పదో తరగతి ఇంగ్లీషు పుస్తకం- అందులో సినిమాల గురించి మరీ అంత ఉండాలని ఎవరు చెప్పారు? మాయాబజార్ సినిమా గురించి , అక్కినేని నాగేశ్వర రావు గురించి- ఇలా యూనిట్‌కి ఒక సినిమా న్యూసు  తప్పనిసరి ఎవరు చేశారు? మన విద్యార్థి  తెలుగు సినిమా రంగం గురించి ఆంగ్ల అచ్చు పుస్తకంద్వారా ఎందుకు నేర్చుకోవాలసలు? ఇదెక్కడి చోద్యం, ఇంకేమీ గుర్తు రాలేదా?! టాగూరు మొదలుకొని  ఆర్ కె నారాయణ్  వరకూ (కాదంటే ఓ హెన్రీ-స్టీవెన్‌సన్-షేక్‌స్పియర్ కానీలెండి) ఆంగ్లంలో రాసిన గొప్ప రచనలున్నాయే, అవన్నీ  ఎక్కడికో పంపించి, అక్కినేని ఎందుకు కావల్సి వచ్చాడట?

సామాన్య శాస్త్రాన్ని , సంఘ జీవితపు విజ్ఞానాన్ని కలగలిపేసి  ఏదో ఒక  అద్భుతం-'పరిసరాల విజ్ఞానం ' చేశాం (ఎందుకు చేశామో ఎవ్వరికీ గుర్తుండదేమో). ఇప్పుడు 'పరిసరాల విజ్ఞానం'లో  నాలుగో తరగతి పిల్లలకు  "RTI చట్టం " గురించి చెబుతారా?!  వాళ్ళ చేత సమాచార చట్టం క్రింద అప్లిక్షన్లు రాయిస్తారా? పరిసరాలు అంటే ఉద్దేశం అదా? మరి  అదే పిల్లలకు  మన దేశంలో  ఏ ఏ రాష్ట్రాలున్నాయో, మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలున్నాయో చెప్పలేదే?! ఏ అంశాలు  ఎప్పుడు, ఏ క్రమంలో  చెప్పాలో ఎలా, ఎవరు  నిర్ణయించాలి? ఏంటి ప్రామాణికత?

సైన్సు పరిస్థితి చూస్తే దిగులేస్తుంది నిజంగా. ప్రయోగాలు  ఎవరు చేయాలో, ఎవరు చేయిస్తారో,వాటి నుండి ఎవరు ఏమి నేర్చుకుంటారో- అంతా పాశ్చాత్యమే(అంటే 'టైంపాసే'). ఉదాహరణకు, ఒక తరగతిలో వంకాయ కూర చేసే ప్రయోగం‌ ఉంది. ఎంతమంది టీచర్లో  ఆ ప్రయోగాన్ని   గైడ్లు చూసి  పిల్లలకు నోట్సు డిక్టేటు చేసి రాయిం(చేయిం)చారు!  'భూమి ఆకారం ఏంటి?' అని  హెడ్డింగు పెట్టి, పది ప్రయోగాలు రాసి, అన్నింటి చివరా 'ఏం కనుక్కున్నారు?' అని రాసి వదిలేస్తే పని అయిపోతుందాండి?- ఎక్కడో ఒక్క చోటైనా సమాచారం ఇవ్వాలి కదా- 'భూమి గుండ్రంగా ఉంది' అని చెప్పాలి కదా, ఆ సంగతి ఎవరు కనుక్కున్నారో, ఎట్లా కనుక్కున్నారో, దాన్ని నిరూపించేందుకు ఎంత కష్టపడ్డారో , ఎన్ని అవమానాల పాలయ్యారో- ఇవన్నీ చెప్పాలి కదా ఎక్కడో ఒకచోట?! ప్రతిదీ 'మీరు గ్రూపులలో కూర్చొని చర్చించండి' అంటే ఎలా సరిపోతుందసలు?! ఉదాహరణకు, నాలుగో తరగతి  పరిసరాల విజ్ఞానం మొదటి పాఠంలో ఎక్కడా  'ఆడపిల్లలకు  సమాన అవకాశాలుండాలి' అని చెప్పరు. దాని బదులు ప్రశ్నలిస్తారు- 'ఆడపిల్లలకు ఏ ఏ ఆటలు నేర్పచ్చు?' అని. ఎవరైనా టీచరు 'తొక్కుడుబిళ్ల, ముగ్గులాట, ముక్కు గిల్లే ఆట..' అని పట్టిక ఇస్తే, కాదని ఏ పిల్లాడంటాడు? ఏ తల్లిదండ్రులంటారు? ఏవీ, టీచర్లకు మార్గ దర్శకాలు?!

గణితం సంగతి మరీ అన్యాయం అయిపోయింది. 'ఐదో తరగతి కంటే ఆరో తరగతి లెక్కలు సులభం' అని పిల్లలు అనుకునే పరిస్థితి. దేనిదారి దానిదే. ఐతే దేనిలోనూ ప్రాక్టీసు చేసుకునేందుకు లెక్కలుండవు; ఉన్న లెక్కలకు సమాధానాలు ఎక్కడా దొరకవు. ఉదాహరణకు, నాలుగో తరగతి లెక్కల్లో ఒక బొమ్మ ఉంది: ఒక దీర్ఘ చతురస్రం-దానికి కర్ణాలు గీసి ఉంటాయి; అవి కాక నిలువుగా అడ్డంగా మరో రెండు గీతలుంటాయి, ఎదురెదురు భుజలను సమద్విఖండన చేస్తూ. "ఇందులో ఎన్ని త్రిభుజాలున్నాయి?" అని ప్రశ్న. చిన్న త్రిభుజాలు కొన్ని, మధ్య రకంవి కొన్ని, పెద్ద వికొన్ని- అన్నీ కలిపి ఇన్ని. వేటిని వదిలేసినా వేరే సమాధానం వస్తుంది. ఏది సరైన సమాధానమో  టీచర్లు వాళ్ల వాళ్ల తెలివిని బట్టి నిర్ణయించుకోవాలన్న మాట! అన్నీ  పట్టికలు. సాంఖ్యక శాస్త్రం  అనేది లెక్కలను ఎందుకు dominate చేయాలో ఎవరు నిర్ణయించాలి?

అచ్చపు తెలుగుతో నిఖార్సైన ఆంధ్రప్రదేశ్ తయారైంది ఇప్పుడు. నిజాం సాంప్రదాయానికి  ఎవ్వరం కట్టుబడి ఉండనవసరం లేని రోజులొచ్చినై. హైదరాబాదు నగరంలో కూర్చొని దిశా  నిర్దేశం చేసే మహితాత్ములకు చెల్లు చీటీ‌ పలకాలి. రాష్ట్రం అంతటా  ఉన్నారు, ఆయా రంగాల్లో నిష్ణాతులు. వాళ్ళు ఆ యా అంశాలకు సంబంధించిన అవగాహననివ్వాలి. కమ్యూనికేషన్ రంగంలో  పరిణతి చెందినవాళ్ళు  ఆ యా అంశాలను  అక్షర బద్ధం చేయాలి. ఒరవడికోసం‌ ఇరవైఐదు సంవత్సరాలనాటి  పాఠ్య పుస్తకాలను వెలికి తీయాలి. ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ ప్రతి అచ్చు పుస్తకంలోనూ ఒక క్రమం కనబడాలి. ఆ క్రమం పిల్లలకు  అందుతుందా, లేదా అని టీచర్లు  నిర్ణయించుకోవాలి. పదో తరగతి వచ్చేసరికి  ప్రతి  సబ్జెక్టులోను పిల్లలు ఇరవైఐదేళ్లక్రితం నిర్దేశించిన స్థాయిలను అందుకోవాలి.

ఇంత పెద్ద పని ఉంది. మొదలు పెట్టాలి. తప్పుల్ని త్వరగా సవరించుకోకపోతే, ఇప్పుడేమీ కనబడదు- ఇరవైఐదేళ్ల తర్వాత అందరూ మనల్ని తిడతారు.

2 comments:

  1. మంచిమాటలు చెప్పారు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు మాస్టారూ

    ReplyDelete