Saturday, June 28, 2014

అచ్చు పుస్తకాలు బాబయ్యా!

భారతీయులు వివిధ పాశ్చాత్యదేశాల్లో‌ఉన్నత పదవుల్లో నియుక్తులౌతున్న  రోజులివి. ఇలా  నియమింపబడుతున్నవాళ్లంతా   దాదాపు  నలభై  సంవత్సరాల వయస్సువాళ్ళు-  దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మన దేశంలో డిగ్రీ చదువులు చదివిన వాళ్ళు- అంతకు కొద్ది సంవత్సరాల ముందు పదోతరగతి పరీక్షలు రాసి ఉంటారు.
వాళ్ళలోఎవరినైనా కదిల్చి చూడండి: 'చిన్నప్పుడు మేం బాగా చదివాం. మమ్మల్ని  ఫలానావాళ్ళు బాగా చదివించారు. మా బళ్ళో ఫలానావాళ్ళు మాకు చక్కని పునాది వేశారు' అనిగుర్తుచేసుకుంటారు.
అంటే  ఇవాల్టి మన హైస్కూలు చదువులు ఎలా ఉన్నై అన్నది నిజంగా నిగ్గు తేలేది కనీసం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అన్నమాట. ఇది  పాఠశాల విద్య గురించి మాట్లాడేందుకు  మొదటి అవరోధం.

ప్రతి నాలుగైదేళ్ళకూ ఓసారి  అచ్చు పుస్తకాలు మారుస్తాం. "ఇవి బాలేదు"అని మొత్తుకునేవాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు.  వాళ్ళకు అనువైన ప్రభుత్వం వచ్చినప్పుడు  ఇంకో రకంగా మార్చేస్తారు. "ఇవీ బాలేదు" అని ఈసారి ఇంకోళ్ళు మొత్తుకుంటారు.
అందువల్ల, పాఠ్య పుస్తకాల నిర్మాణంలోనే   ప్రామాణికత  తేవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఇరవైఐదు సంవత్సరాల తర్వాత సిగ్గుపడాల్సి రావచ్చు.

అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఉండే  కంపెనీల ఓనర్లకు  ఆసియా దేశాలనుండి వచ్చిన పనివాళ్లంటే ఇష్టం.  కారణాలేంటని అడగండి- ఎవరైనా చెబుతారు: ౧. ఆసియా వాళ్ళు  తక్కువ జీతాలకు పనిచేస్తారు. ౨.ఎక్కువ సమయం‌  పాటు కదలకుండా కూర్చొని పనిచేస్తారు ౩.ఎక్కువ గొణగరు. ౪.శ్రమిస్తారు; పనిలో ప్రాణం పెడతారు.
మరి వాళ్ళవాళ్ల దేశాల యువకులు? ఎక్కువ జీతాలడుగుతారు; రోజుకు రెండు గంటలు టేబుల్ ముందు కూర్చోగానే  oh are we tired అంటారు; పని ఎక్కువ ఉందని గొణుగుతూనే ఉంటారు; వారాంతంకోసమే ఎదురు చూస్తుంటారు; అస్సలు శ్రమపడరు-పనిదొంగలుగా ఉండేందుకు ఇష్టపడతారు.
వీటిలో‌  జీతాల మధ్య తారతమ్యం అంతర్జాతీయ అసమానలతలతో సంబంధం ఉన్న అంశం. ఆ సంగతిని ప్రక్కన పెడితే, ఆసియా దేశస్తులకున్నాయంటున్న   మిగిలిన అన్ని  పాజిటివ్ గుణాలూ  వాళ్ళ  బడి స్థాయినుండి నేర్చుకున్నవే అన్నది స్పష్టంగా తెలుస్తున్నది.  వాళ్ళ విద్యా విధానాల్లో ఉన్నవేవో ఈ గుణాలను  ప్రోత్సహించాయి; పాశ్చాత్య  విద్యా  విధానాల్లో ఉన్నవేవో వాళ్ల  చెడ్డ గుణాలకు కారణాలయ్యాయి-
అంటే అర్థం చేసుకుందాం. ఇంతకాలంగా  మనం మనకు తెలిసో, తెలీకో  మన పిల్లలకు   చాలా సేపు కదలకుండా కూర్చొని, ఫోకస్డ్ గా పని చేయటం నేర్పిస్తున్నాం. ప్రతి చిన్నదానికీ గొణగకుండా ఇష్టంగా  నేర్చుకోవటం, అర్థం‌చేసుకోవటం, పని చేయటం నేర్పిస్తున్నాం. శ్రమించే తత్వాన్ని ఇస్తున్నాం; పనిలో ప్రాణం‌పెట్టటంలో శిక్షణనిస్తున్నాం.
ఇప్పటి మన నూతన విద్యా విధానానికి కూడా ఇవన్నీ ప్రాతిపదికలుగా ఉండాలి.

ఈ దృష్టికోణంతో‌ పరిశీలిస్తే, మన అచ్చుపుస్తకాలు- ఇరవైఐదు సంవత్సరాల క్రితం హిమాలయాలంత ఉన్నతంగా ఉన్నవి, జారుతూ జారుతూ వచ్చాయనీ, మరీ అధ:పాతాళానికి కాకపోయినా, కనీసం సముద్రమట్టానికైతే చేరుకున్నాయనీ అనిపించక మానదు.

ఉదాహరణకు, మన తెలుగు అచ్చుపుస్తకాలనే తీసుకోండి. (ముప్పాళ రంగనాయకమ్మగారు గత నలభై-యాభై ఏళ్ళ తెలుగు అచ్చు పుస్తకాలను పోలుస్తూ  రాసిన పుస్తకం ఒకటి చాలా విలువైంది..దొరికితే చదవండి) వాటిని రాసిన  బృందాల్లో ఎవరెవరున్నారో చూడండి: పాపయ్యశాస్త్రి, జాషువా, దాశరధి- ఇట్లాంటి లబ్ధ ప్రతిష్ఠులైన ధురంధరులు మనసు పెట్టి, పిల్లల తెలుగు పుస్తకాలను తయారు చేసి పెట్టారు. ఇవాల్టి రోజున, మనం అంత గొప్ప తెలుగువాళ్ళు  సూచించిన  క్రమాన్ని   అలవోకగా తృణీకరించి  ఏం   బావుకుంటున్నామో  అర్థం కాదు.
ఈనాటి  తెలుగుపుస్తకాల్లో తప్పులు కొల్లలు. పునరుక్తి దోషాలకు లెక్కలేదు. సామాన్యమైన విషయానికి  అలంకార హీనంగా  వివరణ ఇస్తూ పోవటానికి  అంతులేదు. (బొకేలు తయారు చేయటం గురించిన ఒక పాఠం ఐదో తరగతి  తెలుగువాచకంలో ఉంది చదవండి-oh god! మన భాష అవసరం ఏంటి, ఉద్దేశం ఏంటి, దిశ ఏంటి, గమ్యం ఏంటి?) పద్యరచనా, వచనమా, నాటకమా, బుర్రకథా, వ్యాసమా, కథానికా- ఏ ప్రక్రియ అనేది లేదు. వ్యాకరణ దోషాలను వాడుక భాష  ముసుగున మరగు పరచటం.. చెప్పద్దు.

ఇక పదో తరగతి ఇంగ్లీషు పుస్తకం- అందులో సినిమాల గురించి మరీ అంత ఉండాలని ఎవరు చెప్పారు? మాయాబజార్ సినిమా గురించి , అక్కినేని నాగేశ్వర రావు గురించి- ఇలా యూనిట్‌కి ఒక సినిమా న్యూసు  తప్పనిసరి ఎవరు చేశారు? మన విద్యార్థి  తెలుగు సినిమా రంగం గురించి ఆంగ్ల అచ్చు పుస్తకంద్వారా ఎందుకు నేర్చుకోవాలసలు? ఇదెక్కడి చోద్యం, ఇంకేమీ గుర్తు రాలేదా?! టాగూరు మొదలుకొని  ఆర్ కె నారాయణ్  వరకూ (కాదంటే ఓ హెన్రీ-స్టీవెన్‌సన్-షేక్‌స్పియర్ కానీలెండి) ఆంగ్లంలో రాసిన గొప్ప రచనలున్నాయే, అవన్నీ  ఎక్కడికో పంపించి, అక్కినేని ఎందుకు కావల్సి వచ్చాడట?

సామాన్య శాస్త్రాన్ని , సంఘ జీవితపు విజ్ఞానాన్ని కలగలిపేసి  ఏదో ఒక  అద్భుతం-'పరిసరాల విజ్ఞానం ' చేశాం (ఎందుకు చేశామో ఎవ్వరికీ గుర్తుండదేమో). ఇప్పుడు 'పరిసరాల విజ్ఞానం'లో  నాలుగో తరగతి పిల్లలకు  "RTI చట్టం " గురించి చెబుతారా?!  వాళ్ళ చేత సమాచార చట్టం క్రింద అప్లిక్షన్లు రాయిస్తారా? పరిసరాలు అంటే ఉద్దేశం అదా? మరి  అదే పిల్లలకు  మన దేశంలో  ఏ ఏ రాష్ట్రాలున్నాయో, మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలున్నాయో చెప్పలేదే?! ఏ అంశాలు  ఎప్పుడు, ఏ క్రమంలో  చెప్పాలో ఎలా, ఎవరు  నిర్ణయించాలి? ఏంటి ప్రామాణికత?

సైన్సు పరిస్థితి చూస్తే దిగులేస్తుంది నిజంగా. ప్రయోగాలు  ఎవరు చేయాలో, ఎవరు చేయిస్తారో,వాటి నుండి ఎవరు ఏమి నేర్చుకుంటారో- అంతా పాశ్చాత్యమే(అంటే 'టైంపాసే'). ఉదాహరణకు, ఒక తరగతిలో వంకాయ కూర చేసే ప్రయోగం‌ ఉంది. ఎంతమంది టీచర్లో  ఆ ప్రయోగాన్ని   గైడ్లు చూసి  పిల్లలకు నోట్సు డిక్టేటు చేసి రాయిం(చేయిం)చారు!  'భూమి ఆకారం ఏంటి?' అని  హెడ్డింగు పెట్టి, పది ప్రయోగాలు రాసి, అన్నింటి చివరా 'ఏం కనుక్కున్నారు?' అని రాసి వదిలేస్తే పని అయిపోతుందాండి?- ఎక్కడో ఒక్క చోటైనా సమాచారం ఇవ్వాలి కదా- 'భూమి గుండ్రంగా ఉంది' అని చెప్పాలి కదా, ఆ సంగతి ఎవరు కనుక్కున్నారో, ఎట్లా కనుక్కున్నారో, దాన్ని నిరూపించేందుకు ఎంత కష్టపడ్డారో , ఎన్ని అవమానాల పాలయ్యారో- ఇవన్నీ చెప్పాలి కదా ఎక్కడో ఒకచోట?! ప్రతిదీ 'మీరు గ్రూపులలో కూర్చొని చర్చించండి' అంటే ఎలా సరిపోతుందసలు?! ఉదాహరణకు, నాలుగో తరగతి  పరిసరాల విజ్ఞానం మొదటి పాఠంలో ఎక్కడా  'ఆడపిల్లలకు  సమాన అవకాశాలుండాలి' అని చెప్పరు. దాని బదులు ప్రశ్నలిస్తారు- 'ఆడపిల్లలకు ఏ ఏ ఆటలు నేర్పచ్చు?' అని. ఎవరైనా టీచరు 'తొక్కుడుబిళ్ల, ముగ్గులాట, ముక్కు గిల్లే ఆట..' అని పట్టిక ఇస్తే, కాదని ఏ పిల్లాడంటాడు? ఏ తల్లిదండ్రులంటారు? ఏవీ, టీచర్లకు మార్గ దర్శకాలు?!

గణితం సంగతి మరీ అన్యాయం అయిపోయింది. 'ఐదో తరగతి కంటే ఆరో తరగతి లెక్కలు సులభం' అని పిల్లలు అనుకునే పరిస్థితి. దేనిదారి దానిదే. ఐతే దేనిలోనూ ప్రాక్టీసు చేసుకునేందుకు లెక్కలుండవు; ఉన్న లెక్కలకు సమాధానాలు ఎక్కడా దొరకవు. ఉదాహరణకు, నాలుగో తరగతి లెక్కల్లో ఒక బొమ్మ ఉంది: ఒక దీర్ఘ చతురస్రం-దానికి కర్ణాలు గీసి ఉంటాయి; అవి కాక నిలువుగా అడ్డంగా మరో రెండు గీతలుంటాయి, ఎదురెదురు భుజలను సమద్విఖండన చేస్తూ. "ఇందులో ఎన్ని త్రిభుజాలున్నాయి?" అని ప్రశ్న. చిన్న త్రిభుజాలు కొన్ని, మధ్య రకంవి కొన్ని, పెద్ద వికొన్ని- అన్నీ కలిపి ఇన్ని. వేటిని వదిలేసినా వేరే సమాధానం వస్తుంది. ఏది సరైన సమాధానమో  టీచర్లు వాళ్ల వాళ్ల తెలివిని బట్టి నిర్ణయించుకోవాలన్న మాట! అన్నీ  పట్టికలు. సాంఖ్యక శాస్త్రం  అనేది లెక్కలను ఎందుకు dominate చేయాలో ఎవరు నిర్ణయించాలి?

అచ్చపు తెలుగుతో నిఖార్సైన ఆంధ్రప్రదేశ్ తయారైంది ఇప్పుడు. నిజాం సాంప్రదాయానికి  ఎవ్వరం కట్టుబడి ఉండనవసరం లేని రోజులొచ్చినై. హైదరాబాదు నగరంలో కూర్చొని దిశా  నిర్దేశం చేసే మహితాత్ములకు చెల్లు చీటీ‌ పలకాలి. రాష్ట్రం అంతటా  ఉన్నారు, ఆయా రంగాల్లో నిష్ణాతులు. వాళ్ళు ఆ యా అంశాలకు సంబంధించిన అవగాహననివ్వాలి. కమ్యూనికేషన్ రంగంలో  పరిణతి చెందినవాళ్ళు  ఆ యా అంశాలను  అక్షర బద్ధం చేయాలి. ఒరవడికోసం‌ ఇరవైఐదు సంవత్సరాలనాటి  పాఠ్య పుస్తకాలను వెలికి తీయాలి. ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ ప్రతి అచ్చు పుస్తకంలోనూ ఒక క్రమం కనబడాలి. ఆ క్రమం పిల్లలకు  అందుతుందా, లేదా అని టీచర్లు  నిర్ణయించుకోవాలి. పదో తరగతి వచ్చేసరికి  ప్రతి  సబ్జెక్టులోను పిల్లలు ఇరవైఐదేళ్లక్రితం నిర్దేశించిన స్థాయిలను అందుకోవాలి.

ఇంత పెద్ద పని ఉంది. మొదలు పెట్టాలి. తప్పుల్ని త్వరగా సవరించుకోకపోతే, ఇప్పుడేమీ కనబడదు- ఇరవైఐదేళ్ల తర్వాత అందరూ మనల్ని తిడతారు.

Thursday, June 26, 2014

చంద్రబాబు గారు రుణమాఫీలో తలమునకలైపోతున్నారా?

"అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా - గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా"
అని సినీకవిగారు పాడిస్తారు ఓ సినిమాలో, హాస్యనటుడి చేత.
మనం ఇప్పుడు దాన్నే హీరోల చేత పాడిస్తున్నాం.
చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయ్యాక తొలిసంతకం అప్పుల మాఫీ మీదే చేసి తను హీరో అనిపించేసుకున్నారు.
అయితే అది ఏమంత మంచి పని కాదని ప్రపంచబ్యాంకు మొదలుకొని, రిజర్వు బ్యాంకు వరకూ అందరూ చెప్పేశారు.
తిమ్మిని బమ్మి చేసైనా సరే, మాట నిలుపుకుంటానని శపథం చేసారు ముఖ్యమంత్రిగారు.
నా అసలు బాధ ఏంటంటే, మా నాన్నగారు సినిమాలు పెద్దగా చూడని పాతకాలం మనిషి- నన్ను వేమన పద్యాల మీద పెంచారు- 'అప్పు లేని వాడె అధిక సంపన్నుడు' అని వేమనగారు చెబితే నేను 'నిజం గామోల్సు' అనుకున్నాను. ఒక్క పైసా అప్పు చేయలేదు ఇన్నాళ్ళూ.  అందరూ వ్యవసాయ రుణాలు తీసుకొని కార్లు కొనుక్కుంటుంటే, నేనేమో నాకు ఎవరో, ఎప్పుడో పెట్టబోయే కిరీటం- 'శహభాష్! పైసా అప్పు చేయకుండా బ్రతికాడు' అని చేసే సన్మానం గురించిన ఊహల్లో బ్రతుకుతూ అసలు ఏ అప్పూ పెట్టలేదు-
ఇప్పుడు ఇదంతా అటూ ఇటూ తిరిగి నాకే శఠగోపం‌ పెట్టింది.  అందరికీ‌ లక్షలు రాల్తున్నై, ఉలకాగా. నాకేమో చిల్లి గవ్వ రాదు. అది నా అసలు బాధ.
అయితే ఇక్కడ నేను చెప్పేది అది కాదు- ముఖ్యమంత్రిగారు ఋణమాఫీలో తలమునకలైపోయి, రాష్ట్రానికి ఇంకా వేరేవి కూడా చాలా అవసరం అన్న సంగతి మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుండటం.  కొత్తగా తయారైన (పాత) రాష్ట్రం మనది. చాలా అవసరాలున్నై.
౧.  ప్రతి ఆఫీసులోనూ సమైక్యాంధ్ర ఉద్యమంనుండి-ఎలక్షన్లనుండి పేరుకుపోయిన మామూలు దస్త్రాలు కట్టలు కట్టలు కాదు- కుప్పలు కుప్పలు ఉన్నై. ఆఫీసుల్ని ఊడ్పించి, దుమ్ము దులిపించి, సున్నాలు వేయించి, దస్త్రాలనన్నిటినీ క్లియర్ చేయించే పని మొదటిది. హైదరాబాదులో మరి ఆఫీసులే లేవట! వాటినీ‌ఇప్పించాలిగా, ముందు?!
౨.  ఉద్యోగులు ఎప్పటిలాగానే పదకొండుకు ఆఫీసులకొచ్చి, పన్నెండుకు లంచ్‌కెళ్ళి, మూడుకు తిరిగొచ్చి, నాలుగుకల్లా ప్యాకప్ చెప్పేస్తే ఇక కాంగ్రెస్కి జనాలు వందనం‌ ఎందుకు చేసినట్లు? అందర్నీ ఆఫీసులకొచ్చేట్లు, వీలైతే పని చేసే ఊళ్ళోనే ఉండేట్లు చెయ్యాలి.
౩.  రాయలసీమనుండి హైదరాబాదుకు ఓ మంచి నాల్గు కార్ల రోడ్డుంది.  మరి అనంతపురం నుండి విజయవాడ ఎప్పుడైనా వెళ్ళారా? ఒంగోలుకు? పోనీ విశాఖకు? అసలు రోడ్డు ఉందా అని అనుమానం‌ వచ్చే ప్రదేశాలు ఉన్నై!  అవి అట్లా ఉంటే ఇక రాయలసీమలో హార్డువేర్లు ఎక్కడినుండి వస్తాయి స్వామీ, ఉన్న పార్టులు ఊడిపోతై తప్పిస్తే?! అందుకని, మన రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలను ఓ పదింటిని లెక్కబెట్టి, వాటిని అన్నిటినీ కలుపుతూ రోడ్ల నెట్వర్కులు ప్లాన్ చేయాలి. అవసరం, త్వరగా.
౪.  రాముడి రాజ్యంలో నెలకు మూడు వానలు కురిసేవట. చంద్రబాబుగారి పాత హయాంలో రైతులు పడ్డన్ని కష్టాలు మరెవ్వరూ పడలేదు. బాబుగారు పట్టించుకోలేదు సరే, ఆ కాలంలో రైతుల్ని దేవుడు కూడా పట్టించుకోలేదు. వానలు లేక రైతులు ఎండిపోయారు. తట్టుకోలేక కాంగ్రెసును గెలిపించారు జనాలు. రాజశేఖరుడి జాతకం బావుండింది- రైతులకు పంట రుణాలొచ్చాయి, క్రాప్ ఇన్సూరెన్సులు వచ్చాయి, ఆరోగ్యశ్రీలు, గ్రామాల్లో రోడ్లు- ఇక కేంద్రం పుణ్యమా అని వందరోజుల పని అన్నీ వచ్చి పడ్డాయి. దేవుడికి ఏమనిపించిందో, దండిగా వానలూ కురిపించేశాడు.
ఇప్పుడు మళ్ళీ బాబుకి ఓటేస్తూ రాయలసీమలో ఆందోళన చెందని రైతు లేడు- 'ఈ అయ్యకు వేస్తున్నాం- ఈసారైనా వానలు పడతాయో లేదో' అని. (నాకు తెలుసు-శాస్త్ర ప్రకారం వానలకి-బాబుకి ఏమీ సంబంధం లేదు. కానీ నేను చెబుతున్నది నాగురించి కాదు. రైతుల గురించి. రైతుకు నా శాస్త్రం తెలీదు)
వానలు పడకపోతే, రైతు బతికేంద్కు ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి. ఏం చేస్తున్నావు స్వామీ, బాబూ? త్వరగా తెములు.
ఏం చెయ్యాలో ఆలోచించు. కరువు నెత్తిమీద పడ్డాక ఏం చేస్తాం, ముందే మేల్కొనాలి కానీ?!
౫.  విద్యార్థులు తన్నుకులాడుతున్నారు. కొత్త పుస్తకాలన్నీ తెలంగాణమయాలు! ఏవో కొత్త పద్ధతులు. ఎవరో హైదరాబాదులో ఉన్న సాఫ్టువేరు నిపుణులట, తెలుగు పుస్తకాలు డిసైడు చేశారు. ఓసారి చూడండి. వాటిలో 'కంటెంటు ఏముంది?' అని చూడండి. 'అన్నీ‌మీరే కనుక్కోండి- గ్రూపుల్లో కలిసి కూర్చొని ఆలోచించండి' అని చిన్నపిల్లలకు చెబితే ఎలాగమ్మా?! టీచర్లకే ఏమీ రాదే?! టీచర్లు పిల్లలు అందరూ మూకుమ్మడిగా ఆలిన్వన్నులు కొనుక్కుంటున్నారు. "మీ తరగతిలో వంకాయ కూర ఎలా చేశారో రాయండి" అని ప్రశ్నలిస్తారూ? మేం ఆలిన్వన్నుల్లో చూసి రాస్తాం! అంటున్నారు వాళు. ఇలాగైతే ఎలాగ? పుస్తకాలను మనవాళ్లతో తిరగరాయించాలి. ఒక దృక్పథం‌ ఉండాలి. వాటికి కసరత్తు బాగా జరగాలి.  మొదలు పెట్టాలి కదా, ముందు?!
౬. రాజధాని ఎక్కడ అనే ప్రశ్న ఉండనే ఉన్నది.
౭. వైద్యం గందరగోళం. ప్రభుత్వ ఆస్పత్రులు గందరగోళం. ఏదో ఒకటి చేయకపోతే మిన్ను విరిగి పడుతుంది.
౮. కేంద్రంలో మంత్రులకు సొంత వ్యాపారాలు ఉండరాదని మోడీగారు చెప్పేశారు. మరి రాష్ట్రంలో చూస్తే ఒక్కో మంత్రికీ లెక్కలేనన్ని వ్యాపారాలు. ఒకాయన విద్యావ్యాపారం.. ఒకాయన రవాణా. ఒకాయన ఇంకేదో.. ఎలాగయ్యా ఇంక?! వీళ్ళంతా  మంత్రులుగా ఉండి,  తమకి తాము నేరుగా లాభం చేసుకుంటే జనాలు కళ్ళుమూసుకొని పోయేట్లుందా, పరిస్థితి?!
౯. కరెంటు గందరగోళం. ఉత్పత్తికి కావలసిన బొగ్గు, గ్యాసూ గందరగోళం..
రాస్తే ఇంకా చాలా ఉన్నై, త్వర త్వరగా చేయాల్సిన పనులు.  అన్నీ వదిలిపెట్టేసి, రుణమాఫీని పట్టుకొని తలమునకలైపోతే ఎలాగ?
త్వరగా తెమలాలి!‌ చురుకుదనం ఇప్పుడు తేకపోతే ఇక మీద రాదు! సమయం మించిపోకనే అన్ని రంగాలలోనూ విధాన పరమైన స్పష్టత తేవాలి.






Tuesday, June 24, 2014

వర్తమానం!

పేపరు చదువుతుంటాం.. వాళ్ళేదో రాస్తారు. మన మనసేదో అంటుంది.
ఎవరినో కలుస్తాం.. వాళ్ళేదో అంటుంటారు. మన మనసేదో అంటుంటుంది.
చుట్టూ ఏదో జరుగుతూంటుంది.. మన మనసు ఏదో చెబుతుంటుంది.
మామూలుగా ఐతే వాటిని వదిలేస్తుంటాను-  'వినీల శూన్యాకాశం మీదికి వచ్చి పోతూండే మబ్బులకేముంది ప్రాధాన్యత, అనంతంగా వచ్చిపోయే ఈ ఆలోచనలకేం ప్రామాణికత?' అనుకుంటాను.
"వీటిని అలాగే పోనిస్తుండాలి- అక్షర రూపం ఇచ్చిన కొద్దీ అవి బరువెక్కుతాయి. ఏముంది అంత అవసరం?" అని చాలా ఏళ్ళుగా వాటిని తృణీకరిస్తూ వచ్చాను.
అయితే అవే సందర్భాలు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే వచ్చినై;  అలాంటివే  ఆలోచనలు-  మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నై!
ఎంత తీసి పారేసినా 'మాకూ విలువ ఉన్నది' అని మొరాయిస్తూనే ఉన్నై.
'మాకూ అస్తిత్వం ఉంది- మమ్మల్నెందుకు తీసిపారేస్తావు?' అని మొత్తుకుంటూనే వచ్చినై.
'మాకు విలువ ఇవ్వకపోతే నీ మెదడుని నింపేస్తాం. క్యాన్సర్లమై నిన్ను ముంచెత్తుతాం- జాగ్రత్త' అని బెదిరించినై.
చివరికి నేనే లొంగాను:  ఇదిగో- ఈ బ్లాగు తయారైంది.
నా మనసును ఖాళీ చేసుకునే ప్రయత్నం ఇది.
ఇందులో రాసేవన్నీ వర్తమానం మీద నా మెదడులో కల్గిన ఆలోచనల ప్రతులు.
అవి శాశ్వతాలు ఎలాగూ కావు. గతిశీలమైన ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి అసలు ఏవీ లేవనే నా నమ్మకం.
అన్నీ మారినట్లే, ఈ ఆలోచనలూ మారతై- మారచ్చు- మారాలి కూడా.
'నిన్నటి రోజున నేను ఇట్లా అనుకున్నానా!' అని ఇవాళ్ల అనుకునేందుకు ఇవి అవకాశాన్నిస్తే చాలు నాకు...